ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు నేతలు, మాజీ మంత్రులపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.
అప్పటి నుంచి గనిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ అక్రమ మైనింగ్ పై మరోసారి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణ జరిపి పదిమందిపై కేసులు నమోదు చేసింది. వీరిలో ఏ1గా, వైసీపీ నేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఏ2గా వాకాటి శివారెడ్డి. ఏ3 గా వాకాటి శ్రీనివాసులురెడ్డి. ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.