తండ్రితో కలిసి సరదాగా గ్రౌండ్ బాట పట్టిన ఆ చిన్నారి.. టెన్నిస్‌ బంతిని చూసి ఆకర్షితురాలైంది. పదేండ్ల ప్రాయంలో సంబురంగా ​​రాకెట్‌ పట్టిన ఆ బుడత.. ఇప్పుడు మూడు ఐటీఎఫ్‌ టైటిల్స్‌ ఖాతాలో వేసుకొని దేశంలో మూడో ర్యాంక్‌కు చేరింది! మూడు ఐటీఎఫ్ టైటిల్స్ కైవసం. సానియా వారసురాలిగా గుర్తింపు.
పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ లేదని నిరూపిస్తూ.. ఖర్చుతో కూడిన టెన్నిస్‌ క్రీడలో ప్రతిభ చాటుతున్నది. జూనియర్‌ స్థాయిలో పెద్దగా అనుభవం లేకపోయినా.. సీనియర్‌ సర్క్యూట్‌లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అద్భుతాలు చేస్తున్న ఆ అమ్మాయి.. భవిష్యత్తు సానియా మీర్జాగా మన్ననలు అందుకుంటోంది!!.
సామాజిక మాధ్యమాలు, సినిమాలకు దూరంగా.. గంటల తరబడి కోర్టులో చెమటోడుస్తూ.. గ్రాండ్‌స్లామ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలు ఆడటమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్‌ యామలపల్లి సహజతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
కుటుంబ నేపథ్యం ఏంటి?
మా సొంతూరు ఖమ్మం. నా చిన్నప్పుడే అమ్మానాన్న సుప్రియ, భవాని కుమార్‌ హైదరాబాద్‌కు వచ్చారు. గతంలో నాన్న సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్లు.. కానీ నా ట్రైనింగ్, టోర్నీల కారణంగా అది సాధ్యపడక ఇంజనీరింగ్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా కొనసాగుతున్నారు.
టెన్నిస్‌పై మక్కువ ఎలా కలిగింది?
చిన్నప్పుడు సాధారణ ఫిట్‌నెస్‌ కోసం నాన్న సరూర్‌ నగర్‌ స్టేడియానికి తీసుకెళ్లేవారు. పదేండ్ల వయసులో టెన్నిస్‌ అంటే మక్కువ ఏర్పడింది. ఆరంభంలో అక్కడే ప్రాక్టీస్‌ చేసేదాన్ని.. ఆ తర్వాత ఎల్బీస్టేడియంలో శిక్షణ తీసుకున్నా.
ప్రొఫెషనల్ కెరీర్ ఎప్పటి నుంచి?
పదో తరగతికి వచ్చేసరికి నాకు టెన్నిస్‌పై ఇష్టం మరింత పెరిగింది. దీనితో ఇక భవిష్యత్తులో ఆటతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా. శిక్షణ కోసం రోజుకు దాదాపు 30 కి. ప్రతీ క్షణం నాన్న నా వెంట ఉండేవారు.ప్రహ్లాద్‌ కుమార్‌ జైన్‌ సార్‌ సూచనలతో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌ ప్రారంభించా. చెన్నై వేదికగా 2017లో జరిగిన ఐటీఎఫ్‌ జూనియర్‌ టోర్నీలో సత్తాచాటడంతో నాపై నాకు నమ్మకం ఏర్పడింది. దాని వల్లే యూఎస్‌ కాలేజీలో స్కాలర్‌షిప్‌ లభించింది.
చదువు ఎలా సాగుతోంది?
కెరీర్‌ కొనసాగిస్తూనే.. నాన్న ప్రైవేట్‌ క్లాస్‌ల సహాయంతో ఇంటర్‌ పూర్తి చేశా. అమెరికాలో ఫుడ్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందా. సినిమాలు, సామాజిక మాధ్యమాల జోలికి వెళ్లను. నిజం చెప్పాలంటే అసలు అంత సమయమే లభించదు.
ఇప్పటి వరకు సాధించిన విజయాలు?
మహిళల ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో మూడు ఐటీఎఫ్‌ టైటిల్స్‌ గెలిచా.. ఒక దాంట్లో రన్నరప్‌గా నిలిచా. ఇటీవల జరిగిన సోలాపూర్ ఐటీఎఫ్‌ 25కే టోర్నీలో విజేతగా నిలిచారు.

By Prabhu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *