కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత జట్టు మరోసారి అదరగొట్టింది. ఆదివారం రాత్రి గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో మరో టీ20 రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ సూర్య నమ్మకాన్ని నిలబెడుతూ ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 19.5 ఓవర్లలో కేవలం 127 పరుగులకే బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేశారు. పేసర్లు అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు పడగొట్టారు.
హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్‌తో తమ వంతు సహకారం అందించారు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది. దీంతో టీ20ల్లో ప్రత్యర్థి జట్లను భారత్ ఆలౌట్ చేయడం ఇది 42వ సారి కావడం రికార్డుగా నిలిచింది. బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేయడం ద్వారా పాకిస్థాన్ రికార్డును భారత్ సమం చేసినట్టయింది. టీ20ల్లో పాకిస్థాన్ కూడా తమ ప్రత్యర్థులను మొత్తం 42 సార్లు ఆలౌట్ చేసింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన జట్ల జాబితాలో పాకిస్థాన్‌తో సమంగా భారత్ నిలిచింది. భారత్, పాకిస్థాన్ తర్వాత న్యూజిలాండ్ అత్యధికంగా 40 సార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉగాండా, వెస్టిండీస్ నిలిచాయి. ఉగాండా 35 సార్లు, వెస్టిండీస్ 32 సార్లు ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేశాయి.