ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, కీలక నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజా పరిణామంలో, జయమంగళ వెంకటరమణ అనే ఎమ్మెల్సీ తన పదవికి మరియు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
జయమంగళ వెంకటరమణ, కైకలూరు నియోజకవర్గానికి చెందిన నేతగా, గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. అయితే, తాజా పరిణామాల్లో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు పంపినట్లు తెలిపారు. తదుపరి రాజకీయ ప్రయాణంపై స్పష్టత ఇవ్వనప్పటికీ, తిరిగి టీడీపీలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మరింత స్పష్టత త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.