దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయని మాజీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై వివరణ ఇచ్చేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. అయితే, భారతదేశంలోని మెట్రో నగరాల్లో ఢిల్లీలో మహిళలపై నేరాలు అత్యధికంగా ఉన్నాయి. ఆ విషయంలో మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రోజురోజుకు హత్యలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. మన దేశానికి ఢిల్లీ క్రైమ్ క్యాపిటల్ గా మారుతున్నట్లు కనిపిస్తోంది. పాఠశాలలు, విమానాశ్రయాలకు తరచూ బాంబు బెదిరింపులు రావడంతో డ్రగ్స్ సంబంధిత కేసులు 300 పెరిగాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఇక, ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులతో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. నిత్యం వారంతా భయంభయంగా జీవితం గడుపుతున్నారు. పట్టపగలే హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌లు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలు క్షీణిస్తుండటం, ఢిల్లీకి రేప్ క్యాపిటల్, క్రైం క్యాపిటల్ అనే కొత్త పేర్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గురించి మరింత స్పష్టంగా వివరించేందుకు కొంత సమయం ఇవ్వాలని కేజ్రీవాల్ లేఖలో ప్రస్తావించారు.