తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలు పరిశీలించనున్నారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఈ క్రమంలో, రేపు జరగబోయే సమావేశంలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పద్ధతులు, ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు.
కాంగ్రెస్ ముఖ్య నేతలు, నాయకులు సుదీర్ఘ సమీక్షల్లో పాల్గొంటుండగా, సీఎం రేవంత్ రెడ్డి పలు ముఖ్యమైన కార్యక్రమాలను పరిశీలిస్తూ, అధికార యంత్రాంగాన్ని ఉత్సాహపరుస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు తీరును మెరుగుపర్చడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సేవలన్నింటినీ చేరవేసేందుకు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రేపటి సమావేశం కీలకంగా ఉండనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.