ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజీనామా చేయనున్నారు. ఈరోజు ఆయన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఆయనను కలసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఇటీవల కేజ్రీవాల్ తాను రెండురోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఢిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణను ఎదుర్కొన్నారు. ఇటీవలే ఆయనకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తాను నిర్దోషిని కావడం వల్లే సుప్రీంకోర్టు సైతం బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు.
తనపై అక్రమ కేసులు మోపారని, ఈ క్రమంలో ఇక ప్రజాక్షేత్రంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. నిర్దోషిగా బయటపడిన తర్వాతనే ముఖ్యమంత్రి బాధ్యతలను చేపటతానని ఆయన సవాల్ విసిరారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ను కలవడానికి ముందు ,ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కాబోయే కొత్త ముఖ్యమంత్రి పేరుపై కూడా చర్చిస్తారు. కాగా, సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుపై కొందరు నేతలతో ముఖాముఖీ సమావేశమయ్యారు.