తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం తెలుగులో ఉత్తర్వులు జారీ చేశారు. బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరను ధరించి, ప్రశాంతమైన నడవడికతో సంప్రదాయ మహిళా మూర్తిగా ఉన్న ఈ విగ్రహం నేడు తెలంగాణ తల్లి విగ్రహంగా ఆమోదం పొందింది. ఇక నుంచి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రం, జిల్లా, మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని ప్రభుత్వం జీవో లో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. తెలంగాణ తల్లి విగ్రహం మన జాతీయ గుర్తింపు, ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలంగాణ తల్లి బొమ్మను, రూపురేఖలను వక్రీకరించడం, మరో విధంగా చూపించడం నిషేధమని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో మాటలతో లేదా చర్యల ద్వారా అగౌరవపరచడం, నాశనం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరమని జీవోలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *