పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రూ.79.57 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లోని 79,216 మంది రైతులకు చెందిన 79,574 ఎకరాల పంట నష్టం జరిగిందని అధికారులు నివేదిక సమర్పించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 28,407 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 14,669, సూర్యాపేట జిల్లాలో 9,828 ఎకరాలు, మిగిలిన 22 జిల్లాల్లో అత్యల్పంగా 19 నుంచి 3,288 ఎకరాల వరకు పంటనష్టం జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నెల రోజుల వ్యవధిలోనే రైతులకు పరిహారం విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలోనే నగదు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు.