శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లాస్య తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితుడని, తాము చాలా ఏళ్లుగా కలిసి పనిచేశామని రేవంత్ గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లాస్య నందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. కంటోన్మెంట్ ప్రజల గుండెల్లో సాయన్న, లాస్యనందిత చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వారు చేయాలనుకున్న పనలను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. లాస్య మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రేవంత్ పేర్కొన్నారు.