బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కాన్వాయ్‌ను ముషీరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా, మూసీ పరివాహక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను అధికారులు గుర్తించారు. ఆర్ బీ-ఎక్స్ అని రాసి ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఈ చాదర్ ఘాట్ వద్ద మూసీ కూల్చివేతను పరిశీలించేందుకు కేటీఆర్ కొద్దిసేపటి క్రితం బయల్దేరి వెళ్లారు. అయితే విషయం తెలిసిన కాంగ్రెస్ శ్రేణులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ముషీరాబాద్‌కు చేరుకున్న కేటీఆర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఇందులో భాగంగా ఇవాళ పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ పరిధిలోని లంక(తులసీరాం) ప్రాంతంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులతో కేటీఆర్ భేటీ కానున్నారు. కేటీఆర్ తో పాటు అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇతర నేతలు పాల్గొంటారు. నిన్న (సోమవారం) హైదర్‌గూడ, కిషన్‌బాగ్‌లోని వివిధ కాలనీల నుంచి మూసీ బాధితుల కోసం వెతుకులాట గురించి కేటీఆర్ ఆరా తీశారు.