‘చిత్రపురి’ నూతన ఫ్లాట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక్కడ కట్టే ఫ్లాట్లలో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ అంటే కేవలం ఐదారుగురు పెద్దలది మాత్రమే కాదని గుర్తించాలన్నారు. తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వాళ్లు చాలా గొప్ప సినిమాలు తీశారని పేర్కొన్నారు.
‘మాభూమి’ నుంచి ‘బలగం’ వరకు తెలంగాణ వారు తీసినవే అన్నారు. రాష్ట్రంలో సినిమా మరింత అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. థియేటర్స్ ఇప్పించమని తన వద్దకు వచ్చే ప్రతి చిన్న సినిమా వారికి తనవంతు సహాయం చేస్తానన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తానన్నారు. కాగా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆరోసారి చైర్మన్‌గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా ఎంతోమందికి సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు.