తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీ కుంగుబాటుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌పై విచారణలో భాగంగా భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణా రెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబరు 5న విచారణకు రావాలని స్పష్టం చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ కూలిన ఘటనపై పోలీసులతో సమగ్ర విచారణ జరిపించాలని 2023 నవంబర్ 7న భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి చీఫ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదని జనవరి 12న కోర్టు కొట్టివేసింది. ఆయన పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది.