హనుమకొండ జిల్లా హయగ్రీవ మైదానంలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితర ముఖ్య నేతలు కొనసాగుతున్నారు. వరంగల్‌కు 112 ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కేటాయించింది. మొదటి దశలో 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ జెండా ఊపి ఈరోజు ప్రారంభించనున్నారు. సంక్రాంతికి ముందు మరో 25 బస్సులు రోడ్డెక్కనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్య శ్రీ 5-10 లక్షలు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, 2 లక్షల రైతు రుణమాఫీ, 40 శాతం డైట్ చార్జీలు పెంచాం.. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా 12 వేలు ఇస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ యోజన రూల్స్ రైతు భరోసాకి పెడితే ఎవరికి రాదని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం.. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం.. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని వెల్లడించారు.