రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు, ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుందన్నారు. రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలను వినియోగించుకోవచ్చు. 73373-59375 నంబర్‌తో మరిన్ని సేవలు ఉంటాయి అని తెలిపారు. రైతుల సమయాన్ని వృథా చేయకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తామన్నారు. రైతులు నంబర్‌కు హాయ్ అని సందేశం పంపినప్పుడు, కృత్రిమ మేధస్సు వారికి ప్రత్యేక వాయిస్ సేవతో వినియోగాన్ని మార్గనిర్దేశం చేస్తుంది.
రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత, రైతు పేరును ధృవీకరించాలని చెప్పారు. అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలన్నారు. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి మూడు ఆప్షన్లుంటాయన్నారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలన్నారు. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలన్నారు. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుందన్నారు. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది నమోదు చేయాలన్నారు. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుందన్నారు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్‌తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషమని పేర్కొన్నారు.