ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు . నిన్న ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయినా విషయం తెలిసిందే . అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో అప్పోయింట్మెంట్ ఖరారు అయింది . సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు.
ఏపీ అన్ని విధాలుగా నష్ట పోయిందని ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రానికి తగిన సాయం అందించాలని చంద్రబాబు కోరనున్నారు. అదే విధంగా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా ప్రధాని మోదీతో, చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా రూ.15వేల కోట్లను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీమ్ కూడా అమరావతి వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. రుణాల రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు. సాయంత్రం 7గంటలకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సుదీర్ఘంగా చర్చిస్తారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని కోరనున్నారు.