వికారాబాద్‌లో కలెక్టర్, తహసీల్దారుపై దాడి ఘటన పట్ల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. వికారాబాద్ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ సహా అధికారులపై దాడి సరికాదన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తోందని, కానీ ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
కలెక్టర్, అధికారులపై దాడిని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రోత్సహించారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి కార్యకర్తలను రెచ్చగొట్టి భూసేకరణ ప్రక్రియను ఆపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలతో కేటీఆర్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.