ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఐసీసీలో ఏఐ అంతర్జాతీయ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఏఐ అనే థీమ్‌తో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి 2 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి 25 ఏఐ మార్గదర్శకాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను విడుదల చేశారు.
అనంతరం మాట్లాడిన సీఎం ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వైపు చూస్తోందన్నారు. కొత్త టెక్నాలజీ ఆశ, భయం అనే రెండింటిని తీసుకొస్తుందని సీఎం వ్యాఖ్యనించారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే ప్రపంచం ఎప్పటికీ మారకుండా అలాగే ఉండిపోతుందని అన్నారు. ఎవరో ఒకరి అద్భుత ఆవిష్కరణలతోనే ప్రపంచంతో పాటు ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. ఇటీవల కొత్త ఆవిష్కరణలతో ఉద్యోగాలు పోతాయనే భయం పట్టుకుందని అయితే ఆ టెన్షన్ అవసరం లేదని ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుందన్నారు. రైల్ ఇంజిన్, టీవీ, కెమెరాతో ప్రారంభమైన ఆవిష్కరణలు ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చాయన్నారు.