భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక సందర్భమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధనలో భాగంగా గతంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని, తన మంత్రివర్గ సహచరుడిగా ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన గతాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరత మాత ముద్దు బిడ్డగా కొనియాడారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.