ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 11 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దాంతో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా ఈ కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. కాగా, ఈ నెల 11 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు సంబందించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్ననే నోటిఫికేషన్ జారీ చేశారు. 11వ తేదీ ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించనున్నారు అనే అంశంపై బీఏసీలో స్పష్టత రానుంది.