హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై 6,015 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొదటి ఆరు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్‌లోనూ వినేశ్ ఫొగాట్ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఆరో రౌండ్ ముగిసే సమయానికి వినేశ్ ఫొగాట్ 1,200 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అయితే 7వ రౌండ్‌లోకి వచ్చేసరికి వినేశ్ ఫొగాట్ 38 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆమె మెజార్టీ క్రమంగా పెరుగుతూ వచ్చింది.

కాగా, జులానా అసెంబ్లీ స్థానంలో వినేశ్ ఫోగాట్ గెలవడం ఓ విశేషమైతే, ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ 19 ఏళ్ల తర్వాత చేజిక్కించుకోవడం మరో విశేషం. వినేశ్ ఫొగాట్ విజయం సాధించడంతో మరో రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. విజయం సాధించిన భారత పుత్రిక వినేశ్ ఫొగాట్‌కు అభినందనలు. ఇది కేవలం జులానా సీటుకు సంబంధించిన పోటీ కాదు, అలాగే మూడు నాలుగు పార్టీల మధ్య పోరు కాదని పేర్కొన్నారు. ఈ పోరు బలమైన అణిచివేతశక్తులతో జరిగిన పోరు అని పేర్కొన్నారు. ఈ పోరులో వినేశ్ ఫొగాట్ గెలిచిందని రాసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *