దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హత్య కేసులో దోషి సంజయ్ రాయ్‌కు శిక్ష పడింది. కోల్‌కతా సీల్డా కోర్టు సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధించింది. బీఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 103/1 కింద సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధించబడింది. దోషిని మరణించే వరకు జైల్లోనే ఉంచాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అతడికి రూ.50 వేల జరిమానా కూడా విధించారు. అంతేకాదు, బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే, ఈ పరిహారం తీసుకునేందుకు మృతురాలి తల్లిదండ్రులు నిరాకరించారు. పరిహారం కాదు మాకు న్యాయం కావాలి అని వారు స్పష్టం చేశారు.

గతేడాది ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌పై సంజయ్‌ రాయ్‌ అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు రుజువైంది. ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ పై కూడా అనుమానాలు కలిగాయి. తొలుత కోల్‌కతా పోలీసులు, ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టారు. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, కోర్టు పోలీసు వాలంటీర్ సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 120 మందికి పైగా సాక్షుల నుంచి సీబీఐ వాంగ్మూలాలు తీసుకుంది. ఇది అరుదైన కేసు అని, దోషికి ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. అయితే కోల్‌కతా సీల్దా కోర్టు అరుదైన కేసుగా పరిగణించిన సీబీఐతో విభేదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *