జగదీష్ హీరోగా, జగన్నాధ పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “యముడు”. ధర్మో రక్షతి రక్షిత అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఆకాష్ చల్లా సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. కానీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేసారు. ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘‘యముడు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కథ విన్నాను, చాలా ఆసక్తికరంగా ఉంది. కథ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.
ఈ రోజుల్లో ప్రేక్షకులు చిన్న సినిమా, కొత్త సినిమా అని చూడటం లేదు. కథ బాగుంటే సూపర్ హిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జగదీష్ ఆమంచి బాగా చేసుంటారు అని నమ్ముతున్నాను. మంచి హిట్ కావాలి” అని కోరుకున్నారు. హీరో, దర్శకుడు నిర్మాత జగదీష్ ఆమంచి మాట్లాడుతూ “మా యముడు చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. మా చిత్ర కథ విషయానికి వస్తే సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి కీడు చేసే వాళ్ళకి యముడు ప్రత్యక్షమై గరుడ పురాణం ప్రకారం శిక్షలు వేస్తుంటాడు. యముడు ఎందుకు ఆలా చేస్తాడు చివరికి ఏమవుతుంది అనేదే చిత్ర కథ. 2005 లో శంకర్ గారి దర్శకత్వం లో హీరో విక్రమ్ గారు నటించిన అపరిచితుడు చిత్రం లాగే అదే కాన్సెప్ట్ లో మా చిత్రం కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ మా యముడు చిత్రం నచ్చుతుంది” అని తెలిపారు.