సంక్రాంతికి వస్తున్నాం మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు నమోదు చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తొలిరోజు ఈ సినిమా రూ.45కోట్లను కొల్లగొట్టింది. ఇప్పటి వరకు వెంకీ కెరీర్ లో ఫస్ట్ డే ఇంత కలెక్ట్ చేసిన మూవీ మరొకటి లేదు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన వెంకటేష్ సైంధవ్ మూవీతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం పదింతల వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఓవర్‌సీస్‌లోనూ కలెక్షన్లను కుమ్మేస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నరేష్, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమాయో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. సినిమాకు పాటలు మంచి హైప్ తీసుకొచ్చాయి. భార్యభర్తల మధ్య ఉండే అపోహలు, గొడవలకు ఓ కిడ్నాప్ డ్రామాను జోడించి దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కథను రాసుకున్నాడు. లాజిక్స్‌తో సంబంధం లేకుండా ఆరంభం నుంచి ముగింపు వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో భార్యకు, మాజీ ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో వెంకీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించగా, మాజీ లవర్‌గా మీనాక్షి చౌదరి కనిపించింది.