కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్’ చిత్రాన్ని తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జనవరి 1, 2015న విడుదలై సంచలన విజయం సాధించింది. వాస్తవానికి ఈ చిత్రం తమిళంలో జూలై 18, 2014న ‘వేలై ఇల్లా పట్టదారి’గా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. విద్యార్థుల భవితవ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి తెలుగులో ‘స్రవంతి’ని విడుదల చేశారు. అప్పట్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా ధనుష్‌కి పెద్ద మార్కెట్‌ని క్రియేట్ చేసింది. ఇప్పుడు సినిమా మళ్లీ విడుదలవుతోంది.
ప్రముఖ దర్శకుడు కిశోర్ తిరుమల తెలుగు డైలాగ్స్ రాయగా డబ్బింగ్ డైలాగ్స్ తరహాలో కాకుండా ఆయన రాసిన మాటలన్నీ ఒరిజినల్ సినిమాకు రాసినట్టు రాశారని అప్పట్లో మంచి పేరు వచ్చింది. ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఎక్స్‌ట్రాడినరీ సాంగ్స్ అందించగా రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉందని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ సరసన అమలాపాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సురభి కీలక పాత్రలో నటించారు. ధనుష్ తల్లిదండ్రులుగా శరణ్య, సముద్రఖని నటించిన ఈ సినిమాలో వివేక్, హృషికేష్, అమితాష్ ప్రధాన్ ఇతర కీలక పాత్రల్లో నటించగా వేల్ రాజ్ దర్శకత్వం వహించారు.