ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ‘ఛరిష్మా డ్రీమ్స్’ రాజేశ్ కల్లేపల్లి ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్ నగరంలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు శంకర్ ఫ్యామిలీ, హీరో రామ్ చరణ్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.
ఇక ఈ మెగా ఈవెంట్ ముగిసిన అనంతరం ‘గేమ్ చేంజర్’ టీమ్ ఇండియాకు తిరుగు పయనమైంది. ఈ మేరకు చిత్రబృందం ఓ ఫొటోను పంచుకుంది. ఫొటోలో చెర్రీ, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, దర్శకుడు బుచ్చిబాబు, నటుడు ఎస్‌జే సూర్య, ఇతరులు ఉన్నారు. కాగా, ‘గేమ్ చేంజర్’లో చెర్రీ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించగా, తమన్ స్వరాలు అందించారు. వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్. జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.