మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించగా, డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్ నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ పీరియాడికల్ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా తెలుగులో కూడా మార్చి 7న విడుదలై ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే, ఈ సినిమా ఇటీవల మరో ఘనత సాధించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా తాలూకా స్పెషల్ స్క్రీనింగ్‌ని భారతదేశ పార్లమెంట్‌లో వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్చి 27 గురువారం సాయంత్రం 6 గంటలకు ‘ఛావా’ ప్రత్యేక ప్రదర్శన ఉండబోనుండగా ఈ స్క్రీనింగ్‌కి దేశ వ్యాప్తంగా ఎంపీలు అంతా హాజరు కానున్నట్లు సమాచారం. అంతే కాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్క్రీనింగ్‌లో సినిమాని చూడనున్నారట. దీంతో ఈ టాక్ వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నప్పటికీ మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.