ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శిస్తారు. కిమ్స్‌కు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని రామ్‌గోపాల్‌పేట పోలీసులు అల్లు అర్జున్‌కి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సమాచారం అందించడంతో ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘పుష్ప-2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శ్రీతేజ్‌ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తనవంతు సాయం అందించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం 9.30 గంటలకు ఆస్పత్రికి చేరుకుని శ్రీతేజ్‌ను పరామర్శించనున్నారు.