కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు చోటుచేసుకుంది. చెరువులో కారు మునిగిపోవడంతో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులు హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్‌లుగా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే, ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్లలోపు వారే. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భూదాన్ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.