సోమవారం జరిగిన వేర్వేరు సంఘటనలలో రెండు స్పైస్‌జెట్ విమానాలను దారి మళ్లించారు. ఒకటి షిల్లాంగ్‌కు, మరొక విమానాన్ని కొచ్చికి సాంకేతిక సమస్యల కారణంగా డైవర్ట్ చేశారు విమానాయాన అధికారులు. అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమేమీ లేదు. ఢిల్లీ-షిల్లాంగ్ స్పైస్‌జెట్ విమానం గాలిలో ఉండగానే మధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాట్నా ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. పాట్నా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అంచల్ ప్రకాష్ మాట్లాడుతూ, విమానం ఉదయం 8.52 గంటలకు పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు.
మరొక సంఘటనలో 117 మంది ప్రయాణికులు, సిబ్బందితో కొచ్చికి వెళ్లే ప్రైవేట్ క్యారియర్ విమానం గాల్లో ఉండగానే మధ్యలో సాంకేతిక సమస్య రావడంతో చెన్నైలో “అత్యవసర ల్యాండింగ్” చేశారు. ఈ క్రమంలో, విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ, “చెన్నై నుండి కొచ్చికి వెళ్లే స్పైస్‌జెట్ క్యూ400 విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరిగి చెన్నైకి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులను దించేశాం.” అని తెలిపారు. అవసరమైన భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయని, విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.