శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడెంలో హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలపై విద్యుత్ లైన్ తెగిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన యాజమాన్యం విద్యార్థులను పాఠశాల నుంచి బయటకు తీసుకొచ్చింది. విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య నుంచి 34కేవీ హైటెన్షన్ లైన్ తొలగించాలని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ఎదుట స్థానికులు నిరసన తెలిపారు. దీంతో అక్కడకు పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
శ్రీనగర్ కాలనీ 34కేవీ సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేసాము ఇప్పటివరకు ఎవరు స్పందించలేదన్నారు. గతంలో ఇలాగే హై టెన్షన్ వైర్స్ తెగిపడి కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హైటెన్షన్ కరెంట్ వైర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. మరి దీనిపై అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.