ఒకవైపు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీనికి తోడు పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటల వరకు సైతం భానుడి జాడ కనిపించకపోవడంతో రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లినా ఎదుటివారు కనిపించే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సత్తుపల్లి,వేంసూరు,పెనుబల్లి,కల్లూరు,తల్లాడ మండలాల్లో చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెల్లవారి 8 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్తితి నెలకొంది. ఓ వైపు పొగమంచు. మరోవైపు విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.చలిగాలులు భారీ వీస్తుండటంతో ఇళ్ళకే పరిమితం అవుతున్నారు.
తీవ్రమైన పొగమంచు కురుస్తుండటంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్ధులు స్కూలుకు వెళ్లాలంటే భయపడుతున్నారు.మరోపక్క హైదరాబాదు-విశాఖపట్నం,విజయవాడ-చతీస్‌ఘడ్ జాతీయ రహదారిపై మంచు కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక అవస్థలు పడుతున్నారు.