తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ఇయర్ విద్యార్థులకు మార్చి 5 నుంచి 24 వరకు, సెకండియర్ విద్యార్థులకు మార్చి 6 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. బ్యాక్‌లాగ్ విద్యార్థులకు జనవరి 29న ఇంటర్ ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుందని తెలిపారు. 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జరగనుందని చెప్పారు. ఈ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జనవరి 31న, సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి1న పెట్టనున్నట్టు పేర్కొన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ప్రాక్టికల్స్ రెండో శనివారం, ఆదివారం కూడా ఉండనున్నాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.