బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం సికింద్రాబాద్, తిరుమలగిరి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, బాచుపల్లి, తార్నాక, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడగా, బయటకు వచ్చిన నగరవాసులు అవస్థలు పడ్డారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం బలహీనంగా మారిందని తెలిపింది. దీని కారణంగా 1.5 కి.మీ మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని,అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలోని అన్ని ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశామని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.