హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫోకస్‌ పెట్టారు. తుర్కయాంజల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువుపై భాగంలో పంటపొలాలు, ఇళ్ళు నీట మునుగుతున్నాయని స్థానికులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు హైడ్రా కమిషనర్. తుర్కయాంజల్ చెరువు FTL పైన వచ్చిన ఫిర్యాదులపై ఏవీ రంగనాధ్ పరిశీలన చేశారు. ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చిస్తామని, అలాగే ఐఐటీ, బిట్స్ పిలాని, JNTU ఇంజనీరింగ్ నిపుణులతో కూడా అధ్యయనం చేస్తామని రంగనాధ్ వెల్లడించారు.

తాము ఇంటి స్థలాలు కొన్నప్పుడు ఈ స్థలంలో నీరు నిలవ లేదని తుర్కయాంజల్‌ చెరువు పై భాగంలో ఆదిత్య నగర్ నివాసితుల ఫిర్యాదు చేశారన్నారు. చెరువుకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని శాస్త్రీయ పద్దతిలో FTL నిర్ణయిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న నివాసితులు ఆందోళన చెందాల్సిన పని లేదని కమిషనర్ చెప్పారు. గ్రామానికి చెందిన మ్యాప్స్, రెవెన్యూ రికార్డులతో పాటు NRSC ఇమేజీలను పరిశీలించి అన్ని శాఖల అధికారులతో సంప్రదించి త్వరలో చెరువు FTL నిర్ధారిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదని, హైడ్రా పేరు చెప్పి మిమ్ములని భయపెట్టేందుకు ప్రయత్నిస్తే నమ్మవద్దన్నారు. తుర్కయాంజల్‌ చెరువు విస్తరణ 495 ఎకరాల్లో వుందని, మొత్తం విస్తీర్ణం 522 ఎకరాలని ఇలా పలు లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటామని హైడ్రా కమిషనర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *