లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైయింది. లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి, కుత్బుల్లాపూర్ సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన భాను ప్రకాష్ అనే 22 ఏళ్ల యువకుడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అరోరా కాలేజీలో మాస్టర్స్ చదువుతున్న భాను ప్రకాష్ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్నాడు. అయితే లోన్ యాప్ ఏజెంట్లు అప్పు చెల్లించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భానుప్రకాష్ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
అయితే మొబైల్ లొకేషన్ ద్వారా భానుప్రకాష్ ఆచూకీ లభించడంతో స్నేహితులు చెరువు వద్దకు వెళ్లి అతడి దుస్తులు, వాహనం గట్టు పై ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం (సెప్టెంబర్ 6, 2024) ఉదయం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మొబైల్ లో లోన్ యాప్ కు సంబంధించిన చాటింగ్ గుర్తించినట్లు తెలిపారు పోలీసులు.