దేశ రాజధాని ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలోని ఒక స్వీట్ షాప్‌లో గురువారం ఉదయం 11:48 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై స్పందించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రమాద స్థలంలో తెల్లటి పొడి వంటి పదార్థం గుర్తించబడినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుడుతో వచ్చిన శబ్ధం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, పూర్తిస్థాయిలో వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు .