తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ, కుల సర్వేను ములుగులోని ఏటూరునాగారం మండలంలోని ఐలాపూర్ షెడ్యూల్డ్ తెగ పంచాయతీ సభ్యులు పలువురు బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామానికి తారురోడ్డు నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం లేదన్నారు. గిరివికాస పథకం ద్వారా బోర్లు వేసి 7 ఏళ్లు కావస్తున్నా, ఆ బోర్లాకు మూడు తీగల కరెంట్ కరవైందని వాపోయారు. తమ గ్రామానికి సరైన సౌకర్యాలు కల్పించే వరకు కుల గణన సర్వేకు అనుమతించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లగా, ప్రజలు తిరస్కరించడం తీవ్రమైన అంశంగా మారింది. ప్రభుత్వం తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తి వేసేందుకు సహకరించడం లేదని గ్రామస్థులు వాపోయారు. అధికారులకు తాము వివరాలు చెప్పమని, తమ ఊరి నుంచి వెళ్లిపోవాలని పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీని తరలించే వరకు సమగ్ర కుల సర్వేకు సహకరించేది లేదని గ్రామస్థులు తీర్మానం చేసి అక్కడి అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.