తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7:27 గంటలకు భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప కేంద్రం నమోదైందన్నారు NGRI రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీనగేష్, భూమి లోపల 40 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు వెల్లడించారు. ఈ ప్రకంపనల ప్రభావం సుమారు 225 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది.
ప్రజలు భూమి కంపనలను గుర్తించి భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ప్రభావం హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలోనూ కనిపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లో మూడు సెకన్లపాటు భూమి కంపించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు గుర్తించబడ్డాయి. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భూకంపానికి అనువైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.