పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆస్పత్రుల పరిస్థితి మారడం లేదు. తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మనం మరణాన్ని కూడా చూస్తాం. వివిధ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నా, ఆసుపత్రుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అధికారుల ఉదాసీన వైఖరితో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు వ్యవహరిస్తున్నారు.
తాజాగా హనుమకొండలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స అందక బాలిక మృతి చెందింది. ములుగు జిల్లాకు చెందిన వర్షిత జ్వరంతో ఈనెల 2న డాల్ఫిన్ ఆస్పత్రిలో చేరింది. అయితే వైద్యం అందక బాలిక మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. తన తప్పేమి లేదని ఆసుపత్రి వర్గాలు చేతులు దులుపుకోవడంతో ఆగ్రహించిన మృతిరాలి బంధువులు రాత్రి డాల్ఫిన్ ఆసుపత్రి కిటికీలను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. మృతి చెందిన బాలికను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువస్తూ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారందరిని కంటతడి తెప్పించింది. డాల్ఫిన్ ఆస్పత్రిలో నెల రోజుల్లో ఇది రెండో ఘటన జరగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసుపత్రిపై ప్రజలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.