పంటల సాగు కోసం చేసిన అప్పులు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. రెండేళ్ల క్రితం తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, కుమారుడు అదే సమస్యతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకలో జరిగింది.
జోర్క శంకరయ్య, శ్యామల దంపతులకు ముగ్గురు కుమారులు. ఈ దంపతులు గ్రామంలో భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తుండగా రెండేళ్ల క్రితం అప్పుల బాధతో శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడైన శివకుమార్ (18) వ్యవసాయం చేస్తుండగా, పెద్ద కుమారుడు, తల్లి కూలి పనులకు వెళుతున్నారు. చిన్న కుమారుడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉంటూ పదో తరగతి చదువుకుంటున్నాడు. శివకుమార్ రూ.2 లక్షలు అప్పులు తెచ్చి నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పంటలు సరిగా పండక, సరైన దిగుబడి లేక మానసిక వేదనతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.