పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, కూచ్ బెహర్ సిటీలలో బుధవారం ఆర్టీసీ బస్ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య ఆస్పత్రిలో జూనియర్ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం కోల్‌కతాలో విద్యార్థులు మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అది కాస్తా హింసాత్మకంగా మారింది. అటు పోలీసులు, ఇటు నిరసనకారులు గాయాలపాలయ్యారు. వీటిని చెదగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లతో పాటు టియర్ గ్యాస్‌లను ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది.
ప్రజలంతా స్వచ్ఛంధంగా బంద్‌లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. అయితే, ఈ బంద్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా బంద్‌ను విఫలం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో బంద్ సందర్భంగా విధుల్లో పాల్గొనే రవాణా కార్మికులైన డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఆలోచనతో హెల్మెట్లు ధరించి డ్యూటీ చేయాలని సూచించింది. ఫలితంగా అన్ని బస్ డిపోలలో ఉన్నతాధికారులు ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు హెల్మెట్లు అందజేశారు.