టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ హీరోస్, దర్శకనిర్మాతలు మండిపడుతున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆమెపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. అలాగే ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. ఈ కేసుపై నేడు కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే, న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరగనుంది.
ఇదిలావుంటే, మంత్రి సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు నిన్న ప్రకటించారు. సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే అని మంత్రి పేర్కొన్నార. బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.