ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లావోస్ కు చేరుకున్నారు. రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీ నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. 21వ ఆసియాన్ – ఇండియా, 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో భాగంగా ఆయన ఆసియాన్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్ ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లినట్లు పీఎంవో తెలిపింది. వియంటియాన్ ఎయిర్‌పోర్టులో దిగిన మోదీకి ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి విలయ్వాంగ్ బౌద్ధఖం ఘన స్వాగతం పలికారు. మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది.
ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆయన డబుల్ ట్రీ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ప్రవాసభారతీయులు ఆయనకు గ్రాండ్ వెల్కం చెప్పారు. చిన్నారులను మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. వాళ్లతో సెల్ఫీలు దిగారు. తర్వాత అక్కడి యువకులతో కలిసి ప్రధాని మోదీ గాయత్రీ మంత్రం సహా వివిధ శ్లోకాలను పఠించారు. అనంతరం లావోస్ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, ప్రాచీన కళల వివరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని తిలకించారు. రాయల్ థియేటర్లో ‘లావో రామాయణం’ ప్రదర్శనను వీక్షించారు.