ఇరాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ నుంచి ఇరాక్‌కు షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్‌లో బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 28 మంది మరణించినట్లు అధికారి బుధవారం తెలిపారు. పాకిస్థాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో గల లర్కానా నగరానికి చెందిన సుమారు 53 మంది ఇరాన్‌కు షియా యాత్రకు బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్డ్ (Yazd)లో మంగళవారం రాత్రి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 28 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారిని ఊటంకిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్‌ఎన్‌ఏ వార్తా సంస్థ నివేదించింది. మరో 23 మంది గాయపడినట్లు పేర్కొంది. బస్సు బ్రేకింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.
‘దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో 11 మంది మహిళలు, 17 మంది పురుషులు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ప్రస్తుతం ఇరాన్‌లోని కర్బలా గవర్నరేట్‌లో లక్షలాది మంది షియా ముస్లింలు అర్బయిన్ తీర్థయాత్రలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే పలు దేశాల నుంచి యాత్రికులు అర్బయిన్ తీర్థయాత్ర కోసం ఇరాక్‌కు వెళుతున్నారు.