లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేసింది. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కూడా దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో హెజ్‌బొల్లా ముష్కరులు దాక్కున్నట్లు తమకు సమాచారం అందిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో ఎంతమేర నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు దూకుడు తగ్గితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణపై చర్చలకు సిద్ధమని హెజ్‌బొల్లా నేత నయీం ఖాసిం బుధవారం ప్రకటించారు.
అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి 25 ఎఫ్-15 యుద్ధ విమానాలను కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. దాడులకు పాల్పడే పాలస్తీనా ప్రజల కుటుంబ సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించేలా కొత్త చట్టాన్ని గురువారం నాడు ఇజ్రాయెల్ తీసుకొచ్చింది. సంబంధిత బిల్లును ఆ దేశ పార్లమెంటులో 61-41 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇజ్రాయెల్‌తో పాటు తూర్పు జెరూసలెంలోని పాలస్తీనా పౌరులకు ఈ చట్టం వర్తించనుంది. బహిష్కరణ వేటు పడ్డవారిని గాజా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టనున్నారు.