కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడి చేసిన తర్వాత, గందరగోళం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దాడికి గురైన బాధితులు ఆలయంలో నిరసన తెలపడంతో, మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆలయంలో ఉన్న వారిపై పోలీసులు దాడి చేశారు. జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్‌మాన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
ఈ ఘటనపై భారతీయ సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు హద్దులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో తెలిపారు. హిందూ భక్తులపై జరిగిన దాడి, కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు అనేక దుశ్చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.