ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వైసీపీ నేత షేక్ రషీద్ హత్య విషయం తెలిసిందే. తాజాగా ఈ హత్య కేసులో ఆరుగురు నిందితులను వినుకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ మేరకు వివరాలను గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సిఐ సాంబశివరావు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో పట్టణంలోని పెద్ద మసీదు బజారుకు చెందిన షేక్ రషీద్‌ను అదే బజారుకు చెందిన షేక్ జిలాని స్థానిక ముళ్లమూరు బస్టాండులో కత్తితో నరికి హత్య చేశాడని, నిందితుడిని ఈనెల 18వ తేదీన అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. రషీద్ హత్యలో జిలానితో పాటు మరో ఆరుగురికి ప్రమేయం ఉందని గుర్తించామన్నారు.
నరసరావుపేట పట్టణంలోని బరంపేటకు చెందిన పఠాన్ అబు బరక్ సిద్ధిక్ ఎలియాస్ సిద్దు, వినుకొండ పట్టణం సీతయ్య నగర్‌కు చెందిన కొమ్ము వెంకటసాయి, నిమ్మలబాయి బజారుకు చెందిన కొమ్ము ఏడుకొండలు, బయలబోయిన అనిల్, ప్రకాశం జిల్లా పంగులూరు మండలం తక్కెళ్లపాడుకు చెందిన పనపర్తి సుమంత్, వినుకొండ పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ రోహిత్ ఎలియాస్ సోహెల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. ఈ హత్య కేసులో రాజకీయ ప్రమేయం లేదని, వీరిద్దరి వ్యక్తిగత కక్షల కారణాంగే ఈ హత్య జరిగిందని తెలిపారు. ఈ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.