టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ హోటల్‌లోని ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు ఆ హోటల్‌పై దాడులు నిర్వహించారు. మద్యం సేవించి డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్ పార్టీలో పట్టుబడిన వారిలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి కూడా ఉన్నారు. కన్హా మహంతితో పాటు అరెస్టయిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్నాడు కన్హా మహంతి. ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. బుల్లితెరపై సూపర్ హిట్ గా నిలిచిన ఢీ షోలో చాలా కాలం గా పనిచేసాడు మహంతి. దాంతో పాటుగా ప్రముఖ డాన్స్ షోలలో పాల్గొని విజేతగా నిలిచాడు కన్హా మహంతి. హైదరాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అక్కడ నుండి కొందరు సప్లయర్స్ ద్వారా హైదరాబాద్ తెప్పించి పార్టీ చేసుకుంటున్నారు కొరియోగ్రాఫర్ మహంతి, ప్రియాంక రెడ్డి. ఈ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్టుచేసారు మాదాపూర్ పోలీసులు. ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను స్టేషన్ కు తరలించిన పోలీసులు అసలు ఈ డ్రగ్స్ బెంగుళూరు నుండి హైదరాబాద్ ఎలా తెచ్చారు, ఇంకా ఈ వ్యవహారంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.