కర్ణాటకలోని రాయచూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెన్ను దొంగిలించాడని తరుణ్ అనే విద్యార్థిని గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఓ గదిలో మూడు రోజులపాటు బంధించి విచక్షణారహితంగా కొట్టారు అని తెలిపాడు. తరుణ్ కుమార్ అనే బాలుడు అన్న అరుణ్ కుమార్‌తో కలిసి రాయ్‌చూర్‌లోని రామకృష్ణ ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నాడు. తరుణ్ మూడో తరగతి కాగా, అన్న అరుణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే గత శనివారం విద్యార్థులంతా ఆడుకుంటుండగా తన పెన్నుపోయిందని, తరుణ్ దానిని దొంగతనం చేశాడని తోటి విద్యార్థి అతనిపై ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్ తరుణ్‌ను ఓ గదిలో మూడు రోజులపాటు బంధించి విచక్షణారహితంగా కొట్టారు. వాళ్లు కొట్టిన దెబ్బలకి తరుణ్ మొహం మొత్తం వాచిపోయింది. ప్రస్తుతం తరుణ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తరుణే కచ్చితంగా పెన్ను దొంగిలించాడా అంటే ఎవరికి తెలియదు. ఈ ఘటనపై తల్లితండ్రులు ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.